Upcomming Movies

Friday, July 20, 2012

‘తూనీగ తూనీగ’ రివ్యూ


నటీనటులు- సుమంత్ అశ్విన్, రియా, మనీషా, ప్రభు, నాగబాబు, సీత, ఎమ్మెస్ నారాయణ, కాశీ విశ్వనాథ్, వినోద్ కుమార్, విజయ్ చందర్, గీత తదితరులు
సంగీతం- కార్తీక్ రాజా
నిర్మాత- మాగంటి రామ్ చంద్రన్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- ఎమ్మెస్ రాజు

మనసంతా నువ్వే, ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సూపర్ హిట్లతో కొన్నేళ్ల క్రితం స్వర్ణయుగం చూసిన నిర్మాత ఎమ్మెస్ రాజు. ఆయన పీక్ లో ఉన్నప్పటి నుంచి తన కొడుకు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేయాలని చూస్తున్నారు. కానీ తర్వాత పౌర్ణమి, వాన, ఆట, మస్కా వంటి వరుస ఫ్లాపులతో డీలాపడిన రాజు.. సుమంత్ అరంగేట్రాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఎట్టకేలకు కొడుకుని తెరమీదికి తెచ్చారు. స్వయంగా దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టి, తూనీగ తూనీగను రూపొందించారు. ఈ సినిమాతో ఆయన రెండు లక్ష్యాలపై గురిపెట్టారు. కొడుకుని సక్సెస్ ఫుల్ హీరోగా నిలబెట్టడం, ఇంకొకటి ‘వాన’ సినిమాతో దర్శకుడిగా తనకొచ్చిన చెడ్డపేరును చెరిపేసుకోవడం. ఇందుకోసం ఆయన మంచి ప్రయత్నమే చేశారు కానీ.. పూర్తిగా సఫలం కాలేదు. ‘తూనీగ తూనీగ’ ఓ సగటు చిత్రం మాత్రమే!
కోటీశ్వరుడైన రాజేంద్రప్రసాద్ (నాగబాబు), వాళ్లింట్లో వంటవాడైన రామస్వామి (ప్రభు) స్నేహితులు. అంతస్తులు వేరైనా వారి మధ్య ఆ భేదాలుండవు. రాజేంద్రప్రసాద్ కూతురు నిధి (రియా), రామస్వామి కొడుకు కార్తీక్ (సుమంత్) చిన్నప్పటి నుంచి బద్ధ శత్రువులు. నిధిని ఎప్పుడూ ఏడిపిస్తుంటాడు కార్తీక్. ఐతే పై చదువుల కోసం నిధి విదేశాలకు వెళ్తుంది. కార్తీక్ కు పెద్ద డ్యాన్సర్ కావాలన్నది లక్ష్యం. వీళ్లిద్దరూ పెద్దవాళ్లవుతారు. ఆ సమయానికి రాజేంద్రప్రసాద్ తన సన్నిహితుల కుటుంబాలతో కలిసి ఓ వెకేషన్ ఏర్పాటు చేస్తాడు. దానికి రామస్వామి చెఫ్ గా వస్తాడు. అక్కడ నిధి, కార్తీక్ కలుస్తారు. కొన్ని గొడవల అనంతరం ప్రేమలో పడతారు. ఐతే కొన్ని అపార్థాల వల్ల విడిపోతారు. నిధికి తన బావతోనే పెళ్లి ఖాయమవుతుంది. కార్తీక్ కూడా తప్పనిసరి పరిస్థితుల్లో తన డ్యాన్స్ పార్టనర్ తో పెళ్లికి సిద్ధమవ్వాల్సి వస్తుంది. మరి కార్తీక్, నిధి తిరిగి కలిశారా లేదా అన్నది మిగిలిన కథ.



చాలా సాధారణమైన కథ ఇది. ఐతే ఎమ్మెస్ రాజు నిర్మాతగా ఉన్నప్పటి నుంచి కథల కంటే కథనం మీదే ఎక్కువగా దృష్టిపెడుతూ వచ్చారు. మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి సినిమాలకు ఆయన సమకూర్చిన స్క్రీన్ ప్లే జనాల్ని మెప్పించింది. ‘తూనీగ తూనీగ’లో కూడా అలాంటి మాయే చేద్దామని చూశారు రాజు. కానీ ఆయన మాయ ప్రథమార్ధంలో మాత్రమే వర్కవుటైంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా తరహాలోనే హీరోహీరోయిన్ల మధ్య చిన్న కాన్ఫ్లిక్ట్ తో సరదా సన్నివేశాలు పుట్టించి, కథనాన్ని వేగంగా నడిపించారు రాజు. టైటిల్స్ కు ముందు పది పదిహేను నిమిషాల ఇంట్రడక్షనే సినిమా మీద మంచి ఇంప్రెషన్ కలుగజేస్తుంది. షాయాజి షిండే వ్యాఖ్యానంతో సాగే సన్నివేశాల్లో పరుచూరి బ్రదర్స్ మాటలు కూడా షార్ప్ గా ఉండి, సినిమాకు మంచి ఆరంభాన్నిచ్చాయి. హీరోహీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ రొటీన్ గా, సినిమాటిక్ గా సాగినా సన్నివేశాలు వేగంగా, వినోదాత్మకంగా సాగిపోవడంతో ఇబ్బంది అనిపించదు. ఇంటర్వల్ మలుపు కూడా బాగానే ఉంది. కానీ తర్వాతే సమస్యంతా. క్లైమాక్స్ ఇదీ అనుకున్న దర్శకుడు.. ఇక అక్కడిదాకా కథనాన్ని నడిపించడానికి నానా కష్టాలు పడ్డాడు. ఆసక్తి లేని బోరింగ్ సన్నివేశాలతో నడిపించేశాడు. ఈ క్రమంలో ప్రధాన పాత్రల ఔచిత్యం కూడా దెబ్బతింది. వారి క్యారెక్టరైజేషన్ ను కూడా ఎలా పడితే అలా మార్చేసి, ఎలాగోలా సన్నివేశాల్ని పేర్చేసి మమ అనిపించేశారు. ముగింపు పర్లేదనిపించడంతో సినిమా ‘ఏవరేజ్’గా బయటపడింది. ఇంతకీ సినిమాకు ‘తూనీగ తూనీగ’ టైటిల్ ఎందుకు పెట్టారన్నది మాత్రం అర్థం కాలేదు.
ఐతే హీరోగా సుమంత్ మంచి మార్కులే వేయించుకున్నాడు. స్మార్ట్ గా ఉన్న ఈ కుర్ర హీరో తొలి సినిమా అయినా కాన్ఫిడెంట్ గా నటించాడు. అతణ్ని చూస్తుంటే రామ్ లాగా అనిపించాడు. రామ్ ఫీచర్స్ తో పాటు, కాన్ఫిడెన్స్ కూడా సుమంత్ లో కనిపించింది. కొన్ని సన్నివేశాల్లో కావాల్సిందానికంటే ఎక్కువ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినా మొత్తంగా ఓకే. ఎక్కడా తడబాటు కనిపించలేదు. డ్యాన్స్ లో అదరగొట్టాడు. చాలా ఈజ్ తో స్టెప్పులేశాడు. భవిష్యత్తులో నిలదొక్కుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. హీరోయిన్ రియా మాత్రం సినిమాకు పెద్ద మైనస్ అయింది. అందం, నటన రెండింట్లోనూ ఆకట్టుకోలేదు. నవ్వినా, ఏడ్చినా అదోలా ఉండే ఆమె ముఖం హీరోయిన్ రేంజికి సరిపోలేదు. ఆమె జెనీలియాకు డూప్ లా ఉంది. మంచి అందమైన అమ్మాయిని పెట్టుంటే సినిమాకు కచ్చితంగా ప్లస్ అయ్యేది. నాగబాబు నటన ఓకే. ప్రభు డార్లింగ్ తరహా పాత్రలో కనిపించారు. షాయాజి షిండే భిన్నమైన పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు.
ఇళయరాజా తనయుడు కార్తీక్ రాజా అందించిన సంగీతం ఏవరేజ్ గా ఉంది. టైటిల్ పాట మాత్రమే గుర్తుంచుకునేలా ఉంది. అతను లవ్ స్టోరీకి అవసరమైన మెలోడీల్ని ఎందుకివ్వలేదో మరి! దర్శకుడే వద్దన్నాడా?
వర్షంలోని పాటలోంచి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ పదాల్ని తీసుకుని సినిమా తీస్తే సూపర్ హిట్టయింది. కానీ ‘మనసంతా నువ్వే’లోని పాటలోంచి పట్టుకొచ్చిన ‘తూనీగ తూనీగ’ మాత్రం ఎమ్మెస్ రాజుకు కోరుకున్న స్థాయిలో హిట్టిచ్చే అవకాశాలు తక్కువే. ఇప్పటికే ఈగ బాక్సాఫీసులో హల్ చల్ చేస్తోంది. వచ్చేవారం ‘ఊకొడతారా ఉలిక్కిపడతారా’ వస్తోంది. అది కూడా హిట్టయితే మాత్రం ‘తూనీగ’ ఎగరడం కష్టమే!

రేటింగ్ 2.5/5

No comments:

BidVertiser

Followers