నటీనటులు- రామ్, తమన్నా, సుమన్, రిషి, బ్రహ్మానందం, షాయాజి షిండే, అను హాసన్, నాగినీడు, రఘుబాబు, కృష్ణ భగవాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ- ఆండ్రూ
సంగీతం- జి.వి.ప్రకాష్ కుమార్
నిర్మాత- ‘స్రవంతి’ రవికిషోర్
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- కరుణాకరన్
రేటింగ్-2/5
సినిమా అనేదే ఓ అబద్ధం. అందులో ఇంకో పెద్ద అబద్ధాన్ని చూపించి, జనాల్ని మెప్పించడం చాలా కష్టం. డార్లింగ్ సినిమాలో కరుణాకరన్ ఈ పని బానే చేశాడు. హీరోతో ఒక అబద్ధపు కథ చెప్పించి, విలన్ తో పాటు ప్రేక్షకుల్ని చాలా తెలివిగా మోసం చేశాడు. కానీ డార్లింగ్ సినిమా హిట్టవడమే పాపమైంది. ఆ సినిమా ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్ తో.. జనాలు ఏం చూపించినా చూసేస్తారన్న వెర్రి నమ్మకంతో కరుణాకరన్ ఇంకో ప్ర యోగం చేశాడు. ప్రపంచంలో ఏ దర్శకుడికీ రాని చిత్రమైన ఆలోచనతో ‘ఎందుకంటే.. ప్రేమంట’ తీశాడు.
కరుణాకరన్ దర్శకుడు.. రామ్, తమన్నా హీరోహీరోయిన్లు.. జి.వి.ప్రకాష్ కుమార్ సంగీత దర్శకుడు.. అనగానే ఓ క్యూట్ లవ్ స్టోరీని ఊహించుకుని వెళతాం! కానీ పేరులో తప్ప సినిమాలో ప్రేమ లేదు. ఇది ప్రేమ కథ కాదు.. మనల్ని పట్టి పీడించే ‘ఆత్మ’ కథ.
మనిషి చనిపోతే ఆత్మగా మారడం ఇన్నాళ్లూ చాలా సినిమాల్లో చూశాం. కానీ మనిషి బ్రతికుండగానే ఆత్మ బయటికి రావడం ఎక్కడైనా చూశారా? ‘ఎందుకంటే ప్రేమంట’ ప్రత్యేకత ఇదే. ఇప్పటిదాకా వినని, కనని కథ గురించి నాలుగు ముక్కలు..
1980లో మొదలవుతుంది కథ. శ్రీనిధి (తమన్నా) తండ్రిలేని ఓ అమ్మాయి. రోజూ కాలేజీకి వెళ్తున్న ఆమెను కృష్ణ (రామ్) ప్రేమిస్తాడు. రోజూ బస్టాపులో ఆమె కోసం ఎదురుచూస్తుంటాడు. కానీ అతణ్ని కన్నెత్తి చూడదు శ్రీనిధి. మూడేళ్లు ఆమె వెంటపడి.. ఓ రోజు ఆమెను కలవబోయేసరికి ఓ ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదంలో శ్రీనిధిని కాపాడి, తాను ప్రాణాలు వదులుతాడు కృష్ణ. అతని సమాధి వద్దే తానూ చనిపోతుంది శ్రీనిధి. ఇది పూర్వ కథ. వర్తమానంలోకి వస్తే.. స్రవంతి (తమన్నా) పారిస్ లో ఇండియన్ అంబాసిడర్ (సుమన్) కూతురు. ఎప్పుడూ సెక్యూరిటీ మధ్యన ఉండే స్రవంతి స్వేచ్ఛ కోరుకుంటుంది. ఇంటినుంచి పారిపోతుంది. ఇక ఇండియాలో ఉండే రామ్ (రామ్) తన ఫ్యామిలీ వేసిన ప్లాన్ ప్రకారం పారిస్ కు వెళ్తాడు. అక్కడ ఇద్దరూ కలుస్తారు. ఐతే ఓ సమస్యలో చిక్కుకున్న స్రవంతి రామ్ సాయం కోరుతుంది. ఆ సమస్యేంటి? దాన్నుంచి ఆమెను రామ్ ఎలా బయటపడేశాడన్నది మిగిలిన కథ.
డార్లింగ్ మత్తును బాగానే తలకెక్కించుకున్న కరుణాకరన్ దాదాపుగా ఆ సినిమా ఫార్మాట్లోనే తన కొత్త సినిమాని కూడా నడిపించాలని చూశాడు. ప్రథమార్ధమంతా విదేశాల్లో హీరో, హీరోయిన్ల మధ్య సరదాలు, తగాదాలతో కథ నడిపిన కరుణాకరన్.. ఇంటర్వల్ కు ముందు ఓ ట్విస్ట్ ఇచ్చాడు. ద్వితీయార్ధానికి ఫ్యామిలీ డోసిచ్చాడు. కానీ డార్లింగ్ లో ట్విస్టును జీర్ణించుకున్నట్లు ‘ఎందుకంటే ప్రేమంట’లో ట్విస్టును జీర్ణించుకునే అవకాశమే లేదు. ఆత్మగా మారిపోవడం.. పైగా హీరోకు మాత్రమే కనిపించడం అన్నది ఏమాత్రం లాజిక్ కు అందని విషయం. దాన్ని ఏమాత్రం కన్విన్సింగ్ గా చెప్పలేకపోయాడు దర్శకుడు. ద్వితీయార్ధంలో ఎంటర్టైన్మెంట్ డోసు కాస్త పెంచి, కథనాన్ని నడిపించడానికి దర్శకుడు ఎన్నో ఫీట్లు చేశాడు. కానీ గొంతులో పచ్చి వెలక్కాయ అడ్డు పడినపుడు ఎంత రుచికరమైన వంటకాలు తినిపించినా ఏం ప్రయోజనం. లోపలికి పోతే కదా! హీరోయిన్ బతికుండగానే ఆత్మగా మారడమన్న కాన్సెప్టుతో ప్రేక్షకులు ఏమాత్రం కనెక్ట్ కాకపోవడంతో… తర్వాత దర్శకుడు చేసిన ప్రయత్నమంతా వృథా అయింది. సినిమా ఎలా ముగియబోతోందన్న విషయం కూడా ముందే అర్థమైపోవడంతో ఏమాత్రం ఆసక్తి నిలవదు. విలన్ పాత్ర చిత్రణ పేలవంగా ఉండటంతో ఆ ఆసక్తిని మరింత సన్నగిల్లేలా చేస్తుంది. హీరోయిన్ని విలన్ బ్యాచ్ నేరుగా చంపేయకుండా.. ఇండియాకి పంపించి, ప్లాన్ ప్రకారం చంపాలనుకోవడంలో అసలు అర్థం లేదు. సినిమాకు పూర్వ కథ ఏమాత్రం పనికి రాలేదు. అసలు ఆ పది నిమిషాల కథను కూడా సరిగా చెప్పలేకపోయాడు. మూడేళ్లపాటు తన వెంట పడుతున్న అబ్బాయి.. కాళ్లు, ముఖం చూసే అమ్మాయి.. ముఖం మాత్రం ఒక్కసారి కూడా చూడకపోవడమేంటి? ఏదో పెట్టాలన్నట్లు పునర్జన్మ కాన్సెప్ట్ పెట్టారు తప్ప అదేమీ కథకు ఉపయోగపడలేదు. పారిస్ లో జరిగే ప్రథమార్ధమంతా బోరింగ్. ద్వితీయార్ధంలో కొన్ని సరదా సన్నివేశాలున్నప్పటికీ కథనం అప్పటికీ పక్కదారి పట్టడంతో అన్నీ వృథా అయ్యాయి. సినిమాలో చాలవరకు లాజిక్ కు అందని విషయాలే. అసలు హీరో హీరోయిన్ని ప్రేమించడానికి సరైన కారణమే ఉండదు. సినిమాలో పెద్ద ప్లస్ పాయింట్ జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం. నీ చూపులే పాట.. చాన్నాళ్లు గుర్తుంటుంది. కానీ పాటల్ని చాలా బాగా తెరకెక్కించే కరుణాకరన్.. ఈ సినిమాలో ఆ విషయంలోనూ విఫలమయ్యాడు. కరుణాకరన్ సినిమాల్లో కనిపించే ఆహ్లాదకరమైన లొకేషన్లు, ఫొటోగ్రఫీ కూడా ఈ సినిమాలో కరవయ్యాయి.
రామ్ నటన మామూలుగా ఉంది. డ్యాన్సుల్లో అదరగొట్టాడు. తమన్నాను భరించడం మాత్రం చాలా కష్టమైంది. ఒకే రకం ఎక్స్ ప్రెషన్లు.. పైగా చాలావరకు ఒకే డ్రెస్సు. పోయినేడాది ‘ఊసరవెల్లి’లో తన పిచ్చి పాత్రతో జనాలకు పిచ్చెక్కించిన తమన్నా.. మరోసారి ఆ అదే తరహా తేడా పాత్రతో ప్రేక్షకుల్ని భయపెట్టింది. మిగతా పాత్రల్లో చెప్పుకోదగ్గది హీరో అత్త పాత్ర (అను హాసన్). విలన్ గా రిషి ఒకే ఎక్స్ ప్రెషన్ తో లాగించాడు. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేస్తుండటమే ఈ ఇద్దరు తమిళ నటుల ఎంపికకు కారణం కావచ్చు. కానీ ఇలాంటి సినిమాల్ని ఆస్వాదించే స్థితిలో తమిళ ప్రేక్షకుల్లేరు. కాబట్టి రామ్ తమిళ అరంగేట్రం చేదు ఫలితాన్నివ్వడం ఖాయం.
‘‘కొత్త సినిమాలు రావాలంటారు.. ప్రయోగాలు లేవంటారు.. తీస్తే మాత్రం చూడరు’’ అని దర్శకనిర్మాతలు చిరాకు పడొచ్చు. కానీ ప్రయోగం పేరుతో ఏం తీసినా చూడాలంటే కష్టం బాసూ. ప్రయోగాన్ని కన్విన్సింగ్ గా చెప్పడం ముఖ్యం. ‘గజిని’ సినిమాలో లాగా సరైన ట్రీట్మెంట్ ఇస్తేనే ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేది. లేకుంటే ప్రయోగం కాస్తా ప్రమాదంగా మారుతుంది.
ఎందుకంటే ప్రేమంట సినిమా థియేటర్ల దగ్గరికెళ్లండి.. సినిమా చూసొస్తున్న ప్రేక్షకులు చిరాగ్గా కనిపిస్తారు.. అలా ఎందుకంట అని అడిగి చూడండి.. ‘సినిమా బోరంట’ అని సమాధానం రాకపోతే ఒట్టు!
No comments:
Post a Comment