బాలకృష్ణ శ్రీరాముడిగా, నయనతార సీతగా నటించిన పౌరాణిక చిత్రం ‘శ్రీరామరాజ్యం’ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది. బాపు దర్శకత్వంలో నిర్మాత యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని వాల్మీకిగా, లక్ష్మణుడిగా శ్రీకాంత్ ప్రధాన పాత్రలు పోషించారు. అయితే షూటింగ్ పార్ట్ పూర్తిచేసుకుని ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం విడుదల తేదీని బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని ఫిలింనగర్ కల్చరల్ క్లబ్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కార్తీకపౌర్ణమి సందర్భంగా చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు కథానాయకుడు బాలకృష్ణ ప్రకటించారు.
‘మాకెంతో శక్తినిచ్చిన ఈ చిత్రం ఎప్పుడు విడుదలవుతుందా అన్న ఆతృత మాకు కూడా ఉంది. నూటికి నూరుశాతం చిత్రంపైన మాకు నమ్మకం ఉంది. నవరసాలతో అద్భుతమైన దృశ్యకావ్యంగా బాపు దీనిని మలిచారు. గతంలో వచ్చిన కళాఖండం ‘లవకుశ’ను స్ఫూర్తిగా తీసుకుని వైవిధ్యంగా దీనిని మలచడం జరుగుతోంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా షూటింగ్ హాయిగా సాగిపోయింది. ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన బాణీలు శ్రోతలను అలరిస్తున్నాయి’ అని తెలిపారు.
నిర్మాత యలమంచిలి సాయిబాబు మాట్లాడుతూ, ‘మా అంచనాలకు మించి ఈ చిత్రం వచ్చింది. ఇటీవల చెన్నైలో పదిహేను రోజుల పాటు రీరికార్డింగ్ చేశాం. అటుపిమ్మట ముంబాయిలో కూడా జరిపాం. రీరికార్డింగ్‌లో ప్రత్యేకత కోసం హంగేరి నుంచి కూడా వాయిద్యకారులను పిలిపించాం. ముళ్ళపూడి వెంకటరమణ లేనిలోటు తప్ప అన్నివిధాల ఈ చిత్రం ఎంతోగొప్పగా రూపొందింది. ప్రస్తుతం గ్రాఫిక్ పనులు కూడా జరుగుతున్నాయి. మా చిత్రం నిర్మాణంలో ఉన్నప్పుడే అక్కినేనికి పద్మవిభూషణ్, బాలకృష్ణకు నంది అవార్డు రావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఆడియోను సూపర్‌హిట్ చేసిన అభిమానులకు, శ్రోతలకు ధన్యవాదాలు’ అని అన్నారు.
No comments:
Post a Comment