నటీనటులు: రవితేజ, కాజల్, తాప్సీ, శ్యామ్, శ్రీదేవి, రోజా, నాజర్, కృష్ణుడు, నాగబాబు, రాహుల్‌దేవ్, బ్రహ్మానందం, అలీ, వేణుమాదవ్ తదితరులు
కెమెరా: చోటాకెనాయుడు, సంభాషణలు: పరుచూరి బ్రదర్స్, నిర్మాత: గణేష్ ఇందుకూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రమేష్‌వర్మ.
పాయింట్: తన ఊరి కోసం, తనవారి కోసం ఎన్నికష్టాలైనా ఎదుర్కొనే వ్యక్తి కథ.
ముందుగా ఈ చిత్ర నేపథ్యం గురించి చెప్పాలి. బాలకృష్ణ హీరోగా బెల్లంకొండ సురేస్ అప్పట్లో 'భీష్మ'అనే చిత్రాన్ని చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇది జరిగి రెండేళ్ళ అయింది. ఆ చిత్రానికి దర్శకుడు రమేష్‌వర్మ అని ప్రకటించాడు కూడా. కానీ.. ఆ తర్వాత సీన్‌మారి కథకు భారీతారాగణం అవసరం గనుక కొత్త దర్శకుడు డీల్ చేయలేడేమోనని బాలకృష్ణ డౌట్ వ్యక్తం చేశాడట. ఈ విషయాన్ని దర్శకుడే ఇటీవలే చెప్పాడు. నిజాన్ని ఒప్పుకున్నందుకు రమేష్‌వర్మకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.
అదేవిధంగా బాలకృష్ణ చేయక పోయినందుకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే. ఈ చిత్ర కథ ఇంటర్‌వెల్‌తోనే అయిపోయింది అనిపిస్తుంది. కానీ హీరో ఫ్లాష్‌బ్యాక్ తెలియాలంటే సెకండాఫ్‌లో చెప్పాలి కనుక చెప్పినట్లుంది. ఏకంగా రెండు సినిమాల కథలు కలిపి తీసిందే వీర.. ఆ సినిమాలే.. నరసింహనాయుడు, సమరసింహారెడ్డి. రవితేజతో దర్శకుడు చేసిన ప్రయోగమే ఈ చిత్రం. ఇక కథలోకి వెళితే.
ఏసీపీ శ్యామ్‌సుందర్ (శ్యామ్) నిజాయితీగల వ్యక్తి. సిటీలో డాన్ రాహుల్‌దేవ్. అన్నపేరును ఉపయోగించుకుని సోదరులు చేసే అత్యాచారాలకు శ్యామ్ బ్రేక్‌వేస్తాడు. ఆ గొడవలో సోదరులు చనిపోతారు. దీంతో పగతో శ్యామ్ కొడుకును కిడ్నాప్ చేసి చంపేస్తాడు. ఇంతేగాక శ్యామ్ కుటుంబాన్ని నాశనం చేస్తానని శపథం పడతాడు రాహుల్‌దేవ్. ప్రజలకు సేవచేసే తమకే రక్షణ లేకపోతే ఎందుకని డ్యూటీకి రిజైన్ చేస్తుంటే పై అధికారి నాగబాబు వద్దని చెప్పి... శ్యామ్‌కు రక్షణగా దేవా అనే పోలీసు అధికారిని నియమిస్తాడు. కానీ ఆ దేవాని రవితేజ చంపేస్తాడు. ఆ తర్వాత శ్యామ్ ఫ్యామిలీని కంటికి రెప్పలా కాపాడుతుంటాడు రవితేజ (వీర).
ఓ సందర్భంలో వీరను రాహుల్‌దేవ్‌కు పోరు జరుగుతుంటే... మరో గూండా వచ్చి 'వీడు నా శత్రువు. వీడిని నేనే చంపాలంటూ' కాల్చేస్తాడు. దాంతో షాక్‌కు గురైన శ్యామ్ భార్య శ్రీదేవి... తను డాక్టర్ అన్న విషయాన్ని గుర్తుచేసుకుని వీరను కాపాడుతుంది. విషయం తెలుసుకున్న పోలీసు కమీషనర్ విజయకుమార్ వచ్చి అన్నను రక్షించడాని కోసం మర్చిపోయిన వృత్తిని మళ్ళీ చేపట్టావని శ్రీదేవిని అభినందిస్తాడు. తనకు రక్షణగా ఉంది తన బావేనన్న విషయాన్ని తెలుసుకుని శ్యామ్ ఆశ్చర్యపడతాడు. అసలు వీర ఎందుకు వచ్చాడని అడిగితే... కమిషనర్ ఫ్యాష్‌బ్యాక్ చెబుతాడు.
ఆ కథలో ఓ ఊరిలో వీర వెంకట సత్యనారాయణ కుటుంబమంటే ప్రజలకు దేవుడితో సమానం. ఊరికోసం ప్రాణాలు లెక్కచేయని వీరను చంపాలని ప్రత్యర్థులైన ప్రదీప్‌రావత్ వర్గం ఎదురుచూస్తుంటుంది. తన మరదలు కబడ్డీ చిట్టిని వీర పెళ్లిచేసుకుంటాడు. వీరపై పగతో సందర్భం చూసి ప్రత్యర్థులు కబడ్డీచిట్టితో పాటు ఇంటిల్లీపాదీని చంపేస్తుంది. ఇది తెలిసిన వీర వారిని ఏం చేశాడు? అసలు గొడవలు ఎందుకు వచ్చాయి? మధ్యలో తాప్సీ కథేంటి అనేది ఓపిగ్గా చూడాలనుకుంటే సినిమాకు వెళ్ళండి.
రవితేజ తన పాత్రకు బాగానేన్యాయం చేశాడు. వీరోచితపాత్రకు, సాఫ్ట్ పాత్రకు సరిపోయాడు. కాజల్ అగర్వాల్ చలాకీగా చేసింది. సమరసింహా రెడ్డిలో సిమ్రాన్ తరహా పాత్ర ఆమెది. తాప్సీ పాత్రగ్లామరస్‌గా ఉంటుంది. అభినయానికి పెద్దగా అవకావంలేని పాత్ర. బ్రహ్మానందం పాత్ర గత చిత్రాల్లో చేసిన రొటీన్ పాత్రే. నవ్వించే క్రమంలో కాస్త బోర్ కూడా కొట్టిస్తాడు. శ్యామ్ పోలీసుగా సూటయ్యాడు. శ్రీదేవి పాత్ర ఫర్వాలేదు. రోజా పాత్రకు న్యాయం జరగలేదు. కాజల్ తల్లిగా నటించింది.
ప్రదీప్‌రావత్, దివ్యవాణి పాత్రలు ఆవేశంతో కూడిన రాక్షసత్వం గల పాత్రలు. ఆ పాత్రలకు అంత ఆవేశం అవసరామా? అనిపిస్తుంది. మంచివాడు ఉంటే చెడ్డవాడు ఉండాలి. అందుకే ఆ పాత్రలు అలా తీర్చిదిద్దాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పాలంటే... కెమెరా, కాజల్, తాప్సీల గ్లామర్. లోపాలు మాత్రం చాలా ఉన్నాయి. మొదటగా కథే లోపం. పాత చింతకాయపచ్చడిలాంటి కథను మళ్ళీ ప్రేక్షకులపై రుద్దడం సాహసమే.
చెల్లెలు సెంటిమెంట్ ఎక్కువైంది. కామెడీ బూజుపట్టింది. పరుచూరి సంభాషణల పదునులేదు. ఇలాంటి సినిమాలకు రాసిరాసి వీగిపోయినట్లున్నారు. ఫైనల్‌గా దర్శకత్వం లోపం స్పష్టంగా కన్పిస్తుంది. స్క్రీన్‌ప్లే ఆకట్టుకునేట్లుగా లేదు. సెకండాఫ్ ఎప్పుడయిపోతుందా! అనిపిస్తుంది. అంత సన పెట్టాడు. కత్తులు, కఠారులుతో తలలు తెగిపడడం, తొడ కొట్టడాలు, కాళ్ళు, చేతులు నరికేయడాలు... బాంబు బ్లాస్ట్‌లు కావాల్సినంత ఉన్నాయి.
రవితేజ, కాజల్ మధ్య జరిగే శోభనం సీన్స్, ఆ తర్వాత జరిగే డైలాగ్స్‌లు మాస్‌ను దృష్టిలో పెట్టుకుని రాసినవే. చాలా చోట్ల ఎడిటర్‌కే విసుగెత్తి ఏ సీన్‌తీయాలే అర్థం కాలేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం.. సీరియస్‌గా సాగే చోట పాటలు పెట్టడం. అనర్థపు ఆవేశావేశాలు ఈ చిత్రంలో చాలాచోట్ల కన్పిస్తాయి. తను ఏం చెప్పి రవితేజను ఒప్పించాడోగానీ... ప్రేక్షకుల్ని మెప్పించడం కష్టమే. జాతీయస్థాయిలో తెలుగు సినిమాకు గుర్తింపు లేదంటూ... మైకులు పట్టుకుని అరిచే పరుచూరి బ్రదర్స్ వంటి వారి ఎందరికో ఈ సినిమా సమాధానం చెబుతుంది.
No comments:
Post a Comment