‘సుడిగాడు’ రివ్యూ ----3/5
ఎప్పుడైనా అల్లరి నరేష్ సినిమాకు ఒక్క రోజు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోవడం చూశారా? సినిమా మొదలవడానికి అరగంట ముందే థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు గమనించారా? నరేష్ తెరపై ఎంట్రీ ఇవ్వగానే థియేటర్లు దద్దరిల్లిపోవడం చూశారా? సినిమా ముగిసేదాకా ఓ మాస్ హీరో స్థాయిలో నరేష్ జనాలతో చప్పట్లు, కేకలు, ఈలలు కొట్టించడం చూశారా? సుడిగాడు దెబ్బకు ఇవన్నీ సాధ్యమయ్యాయి. నరేష్ కెరీర్లో ఇలాంటి సినిమా ఇప్పటిదాకా రాలేదు. ఇకముందూ రాబోదు. ఇలాంటి క్యారెక్టర్ తెలుగు ఇండస్ట్రీలో నరేష్ ఒక్కడే చేయగలడు. ఒక్కసారి మాత్రమే చేయగలడు. ‘సుడిగాడు’ జనాలు ఏం ఆశించాడో అదే ఇచ్చాడు. తెలుగు తెరపై ఇంతకుముందెన్నడూ లేనంత ‘పేరడీ’ వినోదం!
నిజానికి సుడిగాడు సినిమాలో కథే లేదు. ఇది తెలుగు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాల పేరడీ సన్నివేశాల సమాహారం.. అంతే! టైటిల్ పడ్డప్పటి నుంచి మొదలైపోతుంది పేరడీ. లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ఈగకు స్పూఫ్. రాజమౌళి ఈగ సినిమా టైటిల్స్ లో ఓ పాపకు కథ చెబుతాడు కదా.. ఇందులో భీమనేని ఆ పని చేస్తాడు. అక్కడ ఈగ కథ చెబితే..ఇక్కడ తెలుగు సినిమా హీరో కథ.. టాలీవుడ్ హీరో అంటే అన్నీ సూపర్ మేన్ క్వాలిటీసే కదా. పుడుతూనే సిక్స్ ప్యాక్… ఉచ్చ పోసి విలన్ని చంపేయడం.. తన చిట్టి కాలితో తన్ని విలన్ని కోమాలోకి పంపేయడం.. ఇలా అన్నీ సూపర్ నేచురల్ పవర్స్ తో ఎంట్రీ ఇస్తాడు శివ (అల్లరి నరేష్). ఇక ఆ తర్వాత అతను పెరిగి పెద్దవడం.. ఆపై ఓ లవ్ స్టోరీ.. విలన్స్ తో ఫైటింగలు.. రకరకాల విన్యాసాలు.. చివరికి ఓ క్లైమాక్స్.
సుడిగాడు.. తమిళ్ పడం (తమిళ సినిమా) అనే కోలీవుడ్ మూవీకి రీమేక్. ఐతే అక్కడ హీరో వేషం వేసింది శివ అనే అనామకుడైన హీరో. అముదన్ అనే కొత్త దర్శకుడు చాలా సీరియస్ గా ఈ సెటైరికల్ మూవీని నడిపించాడు. రజనీకాంత్, కమలహాసన్ దగ్గరి నుంచి ఇప్పటి శింబు వరకు హీరోల మీద కూడా తీవ్రమైన సెటైర్లు విసిరారు. నిర్మాత దయానిధి అళగిరి (కరుణానిధి మనవడు) కావడంతో అక్కడ సినిమాకు ఎవరూ అడ్డు చెప్పలేకపోయారు. తమిళ జనాలు బాగా ఆదరించారు. సూపర్ హిట్టయింది. ఐతే మన తెలుగులో అంత సీరియస్ గా నడిస్తే హీరోలు, ఫ్యాన్స్ హర్టవుతారు కదా. అందుకే సీరియస్ నెస్ తగ్గించారు. లైటర్ వేలో సెటైర్లు వేశారు. ఇప్పటికే పేరడీలు చేయడం అలవాటైన నరేష్ తో ఈ సినిమా చేయాలనుకోవడంలోనే దర్శకుడు భీమనేని సగం విజయం సాధించారు. ఇక కాన్సెప్ట్ మాత్రమే తమిళం నుంచి తీసుకున్న భీమనేని.. ఇక్కడి నేటివిటీకి తగ్గట్లు స్క్రిప్టు రాసుకున్నాడు. మన సూపర్ హిట్ సినిమాల్ని బాగా స్టడీ చేసి.. సరైన పేరడీలు రాసుకున్నాడు.
హీరో ఇంట్రడక్షనే అదిరిపోతుంది. హీరో సైకిల్ తొక్కుతూ పెద్దోడైపోవడం.. అతను తన్నగానే ఒకడు విజయవాడలో.. ఇంకొకడు రాజమండ్రిలో.. ఇంకొకడు తిరుపతిలో పడటం.. ఆపై ఎయిట్ ప్యాక్ చూపించడం.. ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతాయి. తర్వాత శివ, ఠాగూర్ స్పూఫ్, రౌడీ స్వర్ణక్క ఎపిసోడ్ ఆకట్టుకుంటాయి. ఇక సినిమాకే హైలైట్ గా నిలిచిన ఆట డ్యాన్స్ షో స్పూఫ్ తో ప్రథమార్ధం ముగుస్తుంది. ఇందులో పోసాని, శివశంకర్ ల కామెడీ అదిరిపోతుంది. ఐతే సెకండాఫ్ లో కొంతసేపు కథనం సాగతీతలా ఉంటుంది. ఐతే మళ్లీ హీరో రాయలసీమకు వెళ్లడంతో మళ్లీ నవ్వుల విందు మొదలవుతుంది. ఇక్కడ తొడకొట్టుడు కామెడీ మరో హైలైట్. పలనాటి బ్రహ్మనాయుడు ట్రైన్ సీన్ కు స్పూఫ్ గా తీసిన కామెడీ కెవ్వు కేక అనిపిస్తుంది. జయప్రకాష్ రెడ్డితో మర్యాద రామన్న ఎపిసోడ్ కూడా బాగానే నవ్విస్తుంది. క్లైమాక్స్ కు ముందు సన్నివేశాలు బావున్నా.. పతాక సన్నివేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో కామెడీ లేదు. సినిమాకు కొసమెరుపులా ఉండాల్సిన క్లైమాక్స్ చప్పగా ఉంది. చిరంజీవి (ఠాగూర్), నాగార్జున (మాస్), వెంకటేష్ (ఘర్షణ), మహేష్ బాబు (పోకిరి), పవన్ కళ్యాణ్ (గబ్బర్ సింగ్), జూనియర్ ఎన్టీఆర్ (దమ్ము), రామ్ చరణ్ (రచ్చ).. ఇలా అందరి సినిమాల్నీ పేరడీలకు వాడుకున్నారు.
ప్రతి సినిమాలోనూ మన పాపులర్ హీరోల్ని అనుకరించడం అలవాటుగా చేసుకున్న అల్లరి నరేష్.. ఈ సినిమా కాన్సెప్టే అదే కావడంతో ఇక చెలరేగిపోయాడు. ఫలానా సన్నివేశం అని చెప్పాల్సిన పనిలేదు. పేరడీలు చేసే ప్రతి సన్నివేశంలోనూ అదరగొట్టాడు. హీరోయిన్ మోనాల్ గజ్జర్ ఓకే. మిగతా నటుల్లో జయప్రకాష్ రెడ్డి బాగా చేశారు. ఎమ్మెస్, కొండవలస, ఎల్బీ శ్రీరాం పెద్దగా నవ్వించలేకపోయారు. జఫ్ఫారెడ్డిగా బ్రహ్మీ, సిద్ధగా శ్రీనివాసరెడ్డి.. ఇంకా రఘుబాబు, ఫిష్ వెంకట్ బాగానే నవ్వించారు. సినిమా విజయవంతం కావడంలో సగం క్రెడిట్ నరేష్ దైతే.. సగం దర్శకుడు భీమనేనికి దక్కుతుంది. అతను సరైన సినిమాల్ని ఎంచుకుని.. వాటిని సరైన విధంగా పేరడీలు రాసుకున్నాడు. అతనే రాసుకున్న మాటలు కూడా బాగానే పేలాయి. సంగీత దర్శకుడు శ్రీ వసంత్ పర్వాలేదనిపించాడు. పేరడీ పాట జర జర బావుంది. ఈ పాట టేకింగ్ కూడా బావుంది.
‘సుడిగాడు’ను మిగతా సినిమాల్లా చూడకూడదు. ఎందుకంటే ఇది ఓ కథంటూ లేకుండా.. లాజిక్కులతో సంబంధం లేకుండా సాగే సినిమా. ఓ పద్ధతంటూ లేకుండా ముందుకెళ్తుంటుంది. కేవలం స్పూఫ్ లు మాత్రమే ఉంటాయని సిద్ధపడే సినిమాకు వెళ్లండి. కావాల్సినంత వినోదం దొరుకుతుంది.
రేటింగ్- 3/5